ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 05 September 2026, 7:02 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

కాంగ్రెస్‌, ఏఐటీయూసీని తరిమికొట్టకపోతే సింగరేణికి మనుగడ ఉండదుమంత్రి దుద్దిళ్లపై మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ తీవ్ర విమర్శలు

కాంగ్రెస్‌, ఏఐటీయూసీని తరిమికొట్టకపోతే సింగరేణికి మనుగడ ఉండదు
మంత్రి దుద్దిళ్లపై మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ తీవ్ర విమర్శలు

పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, సెప్టెంబర్ 05:

కాంగ్రెస్‌, ఏఐటీయూసీ నాయకులను సింగరేణి గనుల గేట్ల నుంచి తరిమికొట్టకపోతే సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపు మేరకు శనివారం రామగిరి మండలం లద్నాపూర్‌లోని ఓసీపీ-2 గని వద్ద టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డితో కలిసి ఆయన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుట్ట మధూకర్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడుస్తున్నా సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి వెయ్యి రోజులైనా పట్టించుకోవడం లేదని అన్నారు. సింగరేణి కార్మికుల పోరాటాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, గతంలో గనుల వద్దకు వచ్చిన కాంగ్రెస్‌ నాయకులను కార్మికులు తరిమికొట్టారని, ఇప్పుడు కూడా కార్మికుల హక్కుల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
మెడికల్‌ అన్‌ఫిట్‌ విషయంలో కార్మికులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. 50 మంది మెడికల్‌ అన్‌ఫిట్‌ కోసం వెళ్తే కొద్దిమందిని మాత్రమే అన్‌ఫిట్‌గా ప్రకటించి మిగిలిన వారిని ఫిట్‌గా ప్రకటించడం ఏ విధమైన న్యాయమని ప్రశ్నించారు. కార్మికుల సమస్యలపై ప్రతిపక్షాలు గొంతెత్తితే వారి హక్కులను అడ్డుకుంటున్నారని, కాంగ్రెస్‌తో కలిసి ఏఐటీయూసీ నాయకులు అక్రమాలకు, అన్యాయాలకు భాగస్వాములవుతున్నారని ఆరోపించారు. సింగరేణి సంస్థను భారీగా అప్పుల్లోకి నెడుతున్నారని, సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మిక వర్గంపై ఉందన్నారు.
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబుపైనా పుట్ట మధూకర్‌ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మంత్రి పదవి వచ్చిన తర్వాత తనకు అన్నం పెట్టిన వారికే సున్నం పెడుతున్నారని ఆరోపించారు. ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ మంథని ప్రాంతంలో యువతకు ఉద్యోగాలు కల్పించే ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేదని అన్నారు. మంథనిలో, కాటారంలో ఐటీ సంస్థలు ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలని తాను గతంలో కోరినా ఇప్పటివరకు స్పందన లేదన్నారు. బీటెక్‌, ఎంబీఏ, ఎంటెక్‌ చదివిన యువత ఉద్యోగాల కోసం రోడ్లపై తిరుగుతున్నారని, ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా సక్రమంగా విడుదల చేయడం లేదని విమర్శించారు.
బొగ్గు, నీరు, అడవులు, ఆలయాలు, భూములు వంటి అపారమైన వనరులు ఉన్నప్పటికీ మంథని నియోజకవర్గ భవిష్యత్తుపై దృష్టి పెట్టడం లేదని ఆరోపించారు. ప్రజల ఇళ్లను కూల్చడం, వ్యాపారులను రోడ్డున పడేయడం అభివృద్ధి కాదన్నారు. దుద్దిళ్ల కుటుంబం దశాబ్దాలుగా అధికారంలో ఉన్నప్పటికీ మంథని నియోజకవర్గానికి ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని అన్నారు.
సింగరేణి ద్వారా వచ్చే డీఎంఎఫ్‌టీ నిధులతో పెద్దపల్లి నుంచి కాటారం వరకు రహదారి అభివృద్ధికి సుమారు రూ.300 కోట్లతో పనులు చేపట్టామని, 95 శాతం పనులు పూర్తయ్యాయని పుట్ట మధూకర్‌ తెలిపారు. మిగిలిన నాలుగు కిలోమీటర్ల రహదారి పనులకు మూడేళ్లు గడిచినా కనీసం తట్టెడు మట్టి కూడా పోయలేదని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబును విమర్శించారు. సింగరేణిని కాపాడుకునేందుకు కార్మికులు ఐక్యంగా పోరాడాలని, కాంగ్రెస్‌, ఏఐటీయూసీ విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కార్మికులను ఇబ్బందులకు గురిచేసే అధికారులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని హెచ్చరించారు.